
ఆదివాసీలకు ఉన్నత విద్య ఉచితం
మన్ననూర్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూని వర్శిటీ ద్వారా ఆదివాసి గిరిజనులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం డీన్, స్టూడెంట్ ఎఫైర్, ప్రొఫెసర్ దయాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఐటీడీఏ ఏఓ జాఫర్‌ఉసేన్‌తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ కారణాలతో ఆదిమ జాతి చెంచులు, కోయ, కొల్లం, కొండ రెడ్లు, గోండులు విద్యాపరంగా ఉన్నత చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. దీంతో వారు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వైస్ చాన్స్‌లర్ గంట చక్రపాణి ఆదేశాల మేరకు సమతా సపోర్టు స్కీం ద్వారా ఆదివాసీలకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం రూ.500 మాత్రమే చెల్లించి ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఆదివాసి గిరిజనులతో పాటు దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు, వారి పిల్లలకు కూడా ఉచితంగా విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్, 73829 29570/580/590/600 ఫోన్ నబర్లను సంప్రదించాలని కోరారు. అంతకు ముందు యూనివర్సిటీ బృందం సభ్యులు అమ్రాబాద్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలను సందర్శించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ బృందం సభ్యుడు డాక్టర్ కంభంపాటి యాదగిరి, విజయ్, కళ్యాణ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.