
క్యూ కట్టి.. రోడ్డెక్కి...
● యూరియా కోసం అన్నదాతల అవస్థలు
● జిల్లాలో యూరియా కొరతపై పెల్లుబికిన నిరసనలు
● సొసైటీల వద్ద రైతుల బారులు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/సాక్షి నెట్‌వర్క్: జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు యూరియా వేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద రైతులు భారీగా క్యూ కడుతున్నారు. సోమవారం మండలకేంద్రాల్లోని పీఏసీఎస్‌లు, ఎరువుల దుకాణాల వద్ద రైతులు బారులు తీరారు. సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రైతులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. మహబూబ్‌నగర్‌లోని బోయపల్లి రోడ్‌లో గల హకా రైతు సేవా కేంద్రానికి సోమవారం 600 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు వచ్చి రైతులను క్యూ లైన్‌లో నిలబెట్టారు. ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు నిరాశగా వెనుదిరిగారు. జిల్లాలో బాలానగర్, నవాబుపేట, దేవరకద్ర, భూత్పూర్, మూసాపేట, అడ్డాకులు, చిన్నచింతకుంట, మిడ్జిల్, జడ్చర్లలో మండలాల్లో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సహకార సంఘాల వద్ద బారులు తీరారు. పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని, పంటలు ఎర్రబారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు మానుకొని 15 రోజులుగా ఎరువుల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మదాబాద్‌లో రైతులు ధర్నా చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హన్వాడ మండల కేంద్రంలో రోడ్డెక్కిన రైతులు చించోళి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.