
మహిళలను అక్షరాస్యులుగా చేయాలి
● కలెక్టర్ విజయేందిరబోయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళా సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల మహిళలను అక్షరాసులుగా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల్లోని 65, 467, మెప్మా ఆధ్వర్యంలో 15వేలను కలిపి మొత్తం 79,467 మందిని ఈ విడతలో అక్షరాసులుగా మాచేందుకు ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. వలంటీర్లను గుర్తించి ఒక్కో వలంటీరు పదిమందికి చదువు నేర్పాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా, మండల స్థాయిలో వలంటీర్లకు నిరక్షరాసులకు ఏ విధంగా చదువు చెప్పాలనే దానిపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. తదుపరివారు గ్రామస్థాయిలో ఎంపిక చేయబడిన వలంటీర్లకు ఈనెల 12వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రజావాణిలో 156 ఫిర్యాదులు
ప్రజల నుంచి అందుకున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం 156 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టుకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, నగర కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం ఇతర అధికారులు పాల్గొన్నారు.
రేపు ఓటరు తుది జాబితా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10వ తేదీన ప్రచురించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్‌లో వివిధ పార్టీల నాయకులతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసినట్లు తెలిపారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని పేర్కొన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పుల అనంతరం తుది జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని తెలిపారు. ఓటర్ జాబితా తయారీలో పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ ముసాయిదాబేగం, కాంగ్రెస్ ప్రతినిధి సిరాజ్‌ఖాద్రి, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, సీపీఎం ప్రతినిధి మోహన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.