
కేసులు సకాలంలో పరిష్కరించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు ఇచ్చే బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 18 మంది బాధితుల వద్ద ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఒక్కొక్కరి ఫిర్యాదును పరిశీలించి సదరు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ తక్షణ చర్యలు తీసుకోడానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. పారదర్శకతతో పని చేయడం పోలీసు ప్రధాన ధ్యేయంగా ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా సరైన పర్యవేక్షణతో కేసులు పరిష్కరించాలన్నారు.
● ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ కావాల్సిన కేసులను గుర్తించి ఇరు వర్గాలను కోర్టుకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ డి.జానకి ఆదేశాలు జారీ చేశారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్, ఆస్తి విభజన, కుటుంబపరమైన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్, చెక్ బౌన్స్, ఎంవీఐ యాక్ట్ ఇలా అన్ని రకాల కేసులను గుర్తించాలన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బందితో పాటు అధికారులు సైతం ఇరువర్గాల కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ అయ్యే విధంగా చూడాలన్నారు.