
రైతు ఆత్మహత్యాయత్నం
మిడ్జిల్: తన తల్లి పేరిట ఉన్న సర్వేనంబర్‌లో తమకు మోఖా చూపించి అప్పగించాలంటూ మండలంలోని వాడ్యాలకు చెందిన రైతు గజ్జల కృష్ణయ్య సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నానికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన జంగమ్మకు గ్రామంలోని సర్వేనంబర్ 156లో 3 గుంటల భూమి ఉంది. ఆ సర్వేనంబర్ జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిని అనుసరించి ఉండటం.. ఆ నంబర్‌లో ఉన్న పట్టాదారులు మోఖా ఇవ్వకపోవడంతో పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న ప్రకారం భూమి హద్దులు నిర్ధారించి అప్పగించాలంటూ తల్లి జంగమ్మతో కలిసి కృష్ణయ్య కొన్నిరోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజు దగ్గరకు వచ్చి తమకు మోఖా చూపించాలని లేదంటే వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి చనిపోతానంటూ డబ్బా మూత తీస్తుండగా అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ ఎస్‌ఐకు ఫోన్‌చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. దీంతో వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.