
తెరుచుకున్న ఆలయాలు
అలంపూర్: రాహుగ్రస్త చంద్రగహణంతో ఆదివారం మధ్యాహ్నం అలంపూర్ ఆలయాలను అర్చకులు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ అధికారులు, అర్చకులు మూసిన ఆలయాల ద్వారాలను తెరిచి గర్భాలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. ఆలయ సిబ్బంది మండపాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వరస్వామి వారికి మహా మంగళహారతి ఇచ్చి ఆలయాల్లోకి భక్తులను అనుమతించారు. చంద్ర గ్రహణం ముగియడంతో ఆలయాల్లో పూజలు యధావిధిగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల భక్తులు క్షేత్రానికి చేరుకొని అమ్మవారు, స్వామివారిని దర్శించుకున్నారు.
మన్యంకొండలో దర్శనాలు ప్రారంభం..
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో చంద్ర గ్రహణంతో ఆదివారం మధ్యాహ్నం నిలిచిన దర్శనాలను సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. అలాగే కొండ దిగువన ఉన్న అలివేలు మంగతాయారు ఆలయంలోనూ దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఆలయ శుద్ధి, పుణ్యాహవాచనం, సంప్రోక్షణ తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
చంద్ర గ్రహణంతో ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన అర్చకులు
ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తదితర ప్రత్యేక పూజల నిర్వహణ
మహా మంగళహారతితో భక్తులకు దర్శనాలు