వరిలో సస్యరక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

వరిలో సస్యరక్షణ చర్యలు

Sep 9 2025 12:40 PM | Updated on Sep 9 2025 12:40 PM

వరిలో సస్యరక్షణ చర్యలు

వరిలో సస్యరక్షణ చర్యలు

అధిక వర్షాలకు

అప్రమత్తంగా ఉండాలి

కోస్గి: ఈ ఏడాది జిల్లాలో పలు ప్రాంతాల్లో వరి పంట అధిక మొత్తంలో సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో నీరు నిల్వ ఉండటంతో చీడపీడలు, పురుగుల ఉధృతి పెరిగే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెగుళ్లు, వివిధ రకాల పురుగులు ఆశించకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ సుధాకర్‌ పలు సూచనలు వివరించారు.

తెగుళ్ల యాజమాన్యం

అగ్గి తెగులు: ఆకులపై నూలు కండె ఆకారంలో గోధుమరంగు మచ్చలు ఏర్పడి చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండినట్లు కనిపిస్తాయి. పైరు పూతదశలో ఉన్నప్పుడు వెన్ను, మెడ భాగంలో తెగులు ఆశిస్తే వరికొమ్మ మెడ ఇరిగి తాలు గింజలు ఏర్పడతాయి.

నివారణ: కేజీ విత్తనానికి 4 గ్రాముల కార్బెండిజ్‌ కలిపి విత్తనశుద్ధి చేయాలి. ట్రై సైక్లోజోల్‌ 75 శాతం మందును 6 గ్రాములు లేదా ఎడిఫెన్‌ఫాస్‌ 1 మి.లీ. లీటర్‌ నీటిలో కలిపి పంటపై పిచికారి చేయాలి.

కాండం కుళ్లు తెగులు: కాండ ఏర్పడే దశ నుంచి పంట పాలు పోసుకునే వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.

నివారణ: తెగులు సోకిన పొలంలో పరిశుభ్రత పాటించాలి. విత్తనశుద్ధి చేయాలి. తెగులు లక్షణాలను గుర్తిస్తే వాలిడామైసిన్‌ 2 మి.లీ. లేదా హెక్సాకోనోజల్‌ 2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి 15 రోజుకోసారి రెండుసార్లు పిచికారీ చేయాలి.

ఎండాకు తెగులు: తెగులు సోకిన పంటలో ఆకు అంచుల వెంబడి పసుపు రంగు మచ్చలు ప్రారంభమై చివరకు ఆకులు పూర్తిగా ఎండిపోతాయి.

నివారణ: ప్రాపికోనోజల్‌ 1 మి.లీ. లేదా హెక్సాకోనోజల్‌ 2 మి.లీ. లేదా వాలిడామైసిన్‌ 2 మి.లీ. మోతాదులో ఏదేని మందును లీటరు నీటిలో కలిపి పొలంలో నీరు మొత్తం తీసివేసి మొదళ్ల వద్ద తడిచేటట్లు పిచికారీ చేయాలి.

పొడ తెగులు, మానిపండు తెగులు: పంట పుష్పించే దశలో ఆశిస్తుంది. అండాశయం ఆకుపచ్చ రంగు ముద్దగా మారిన తర్వాత గింజలన్ని పసుపు రంగు ఉండల్లాగా మారి దిగుబడి తగ్గుతుంది.

నివారణ: హెక్సాకోనోజల్‌ 2 మి.లీ. లేదా ప్రాపికోనోజల్‌ 1 మి.లీ. లేదా వాలిడామైసిన్‌ 2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మోనోక్రోటోఫాస్‌ 2 మి.లీ. మోతాదులో లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పురుగులు.. నివారణ చర్యలు

కాండం తొలిచే పురుగు: ఈ పురుగు సొకితే పిలకలు చనిపోతాయి. వెన్నులు తెల్ల కంకులుగా మారుతాయి. 5 శాతం పువ్వులు చనిపోయినట్లు గుర్తించిన వెంటనే సస్యరక్షణ చేపట్టాలి.

నివారణ క్లోరోఫైరిపాస్‌ 2.5 మి.లీ. లేదా మోనో క్రోటోపాస్‌ 1.6 మి.లీ. లేదా ఎసిఫెట్‌ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఉల్లికోడు: ఈ పురుగు సోకకముందే వరి పంట నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధి లో ఎకరాకు 10 కేజీల కార్బోప్యూరాన్‌ లేదా 6 కేజీల ఫోరేట్‌ గుళికల మందు వేయాలి.

సుడిదోమ/దోమపోటు: వరిలో దోమపోటు నివారణకు నారు నాటే సమయంలో ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. బాటలు వదిలి నాటు వేసుకోవాలి. దోమపోటు, సుడిదోమ గుర్తించిన వెంటనే ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రైడ్‌ 2.2 మి.లీ. మోతాదులో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పాడి–పంట ,జిల్లా వ్యవసాయాధికారి,

జాన్‌ సుధాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement