
గురుకులంలో ఎలుకల స్వైర విహారం
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. గదుల్లో నిద్రిస్తున్న విద్యార్థులను కరిచిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థినులు, పీహెచ్‌సీ వైద్యుడు తెలిపిన వివరాలిలా.. బుద్దారం బాలికల గురుకుల పాఠశాలలో రోజులానే ఆదివారం రాత్రి భోజనాల తర్వాత విద్యార్థులు వారి వారి గదుల్లో నిద్రించారు. అయితే, పదో తరగతి విద్యార్థినులు శశిరేఖ, భవాణి, జ్యోత్స్న, కీర్తన, స్నేహ, ప్రసన్న, సౌమ్య ఒకే గదిలో నిద్రించగా.. తెల్లారేసరికి కాళ్లు, చేతులను ఏదో కరిచినట్లు గుర్తించారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా ఎలుకలు కనిపించాయి. వెంటనే విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లగా వారు మొదట పాఠశాలలో ఉన్న ఆర్‌డీఎస్‌కే క్యాంపునకు, అనంతరం గోపాల్‌పేట పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్యుడు డాక్టర్ చాంద్‌పాష విద్యార్థినుల గాయాలను పరిశీలించారు. ఆరుగురికి చిన్నగా, ఒకరికి మాత్రం సెంటీమీటర్ అంత ఎలుకలు కరిచినట్లు గుర్తించి టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇదే విషయమై గురుకుల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా తాను నెల రోజుల నుంచి సెలవులో ఉన్నానని, ఇన్‌చార్జ్ చూసుకుంటున్నారని, ఎలుకల నివారణ కోసం మందు తీసుకువచ్చామని, సెలవు రోజుల్లో చల్లాలని ఉంచినట్లు తెలిపారు.
జిల్లా అధికారుల సందర్శన
విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు, డీఏఓ ఆంజనేయులుగౌడ్, తహసీల్దార్ పాండు నాయక్ సోమవారం రాత్రి గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు పీహెచ్‌సీలో వైద్యం చేయించుకొని రాగా.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఏడుగురు విద్యార్థినులను
గాయపర్చిన వైనం