
‘రైల్వేగేట్ మూసివేతతో సంబంధం లేదు’
దేవరకద్ర రూరల్: కౌకుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న రైల్వేగేట్ మూసివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీలక్ష్మి వేంకటేశ్వర రైల్వే గోదాముల మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం గోదాముల దగ్గర నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదాములు నిర్మించిన తర్వాతే రైల్వేగేట్ మూసివేశారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రైల్వేశాఖ భవిష్యత్ ప్రణాళికలో భాగంగా కాచిగూడ నుంచి కర్నూలు వరకు ఒకేరోజు అనేక రైల్వేగేట్లను మూసివేసిందని.. అందులో 81వ నంబర్ గేట్ కూడా ఉందని వివరించారు. రైల్వేగేట్‌ను తెరిపించాలని 2024, మార్చి 4న ఎమ్మెల్యేతో కలిసి తాము కూడా రైల్వే జీఎంను కలిసి వినతిపత్రం అందించామని చెప్పారు. అలాగే పుట్టపల్లి రోడ్‌పై గోదాములకు వచ్చే బియ్యం లారీలు తిరగడంతో దెబ్బతినలేదని.. వెంకంపల్లి సమీపంలో ఉన్న క్రషర్ వాహనాల రాకపోకలతోనే ఉండవచ్చని తెలిపారు. రోడ్డు తమ పరిధి సమస్య కానప్పటికీ గ్రామస్తుల ఇబ్బందులను గుర్తించి మరమ్మతుకు సహకరించామని తెలిపారు. స్థానికంగా గోదాములు ఉండటంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందని.. కౌకుంట్ల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.10 లక్షలు అందజేశామని, ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి వారి వేతనాలు చెల్లిస్తున్నామని వివరించారు. గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాములు, భాస్కర్, నితిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.