
ప్రజావాణి సమస్యల పరిష్కారం.. బూటకం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఎన్నో ఆశలు పెట్టుకొని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వచ్చే ప్రజల సమస్యలను అధికారులు పరిష్కరిస్తారనేది ఒట్టి బూటకమని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ మండిపడ్డారు. సోమవారం టీఎఫ్‌టీయూ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యల పరిష్కారంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం సమస్యల పరిష్కారం కోసం ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాల్సిన మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు నాన్చుడు దోరణితో కాలయాపన చేస్తున్నారన్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా పట్టింపులేదన్నారు. సర్వే నంబర్ 523లో ఇళ్ల పట్టాలు స్వాధీనం చేసిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు న్యాయం చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో టీఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గట్టన్న, జలాల్‌పాషా, బోయవెంకటమ్మ, కుమ్మరి పద్మ, బషీరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.