
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
ధరూరు/ఆత్మకూర్/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం 1,10,500 క్యూసెక్కులు ఉండగా... ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 1,20,500 క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లు ఎత్తి 85,104 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు చెప్పారు. అలాగే విద్యుదుద్పత్తి నిమిత్తం 39,351 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 700, సమాంతర కాల్వకు 400, భీమా లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.009 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
613 మి.యూ. విద్యుదుత్పత్తి..
జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 292.964 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 320.595 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
శ్రీశైలంలో మూడు గేట్లు ఎత్తి..
ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం పెరగడంతో ఆదివారం శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లను పైకెత్తి దిగువనున్న నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల ఆనకట్ట స్పిల్‌వే నుంచి 85,104 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 39,351 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 48,906 క్యూసెక్కులు జలాశయానికి చేరుతుండగా.. శ్రీశైలం ఆనకట్ట మూడు గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 82,986 క్యూసెక్కులు దిగవకు వదిలారు.