
మన్యంకొండవాసుడి కల్యాణ వైభోగమే..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటి: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతినెలా పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం జీలకర్ర, బెల్లం ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తలు తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను మళ్లీ పల్లకీలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామి దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.