
గణేశుడి లడ్డును దక్కించుకున్న ముస్లిం
మక్తల్: మండలంలోని ముస్టిపల్లి గ్రామంలో గణేశ్ ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి లడ్డు వేలం నిర్వహించగా ముస్లిం వ్యక్తి దక్కించుకున్నాడు. వేలంలో దాదాపు 10 మంది పాల్గొనగా గ్రామానికి చెందిన ఎండీ పాషా రూ.26,116కు లడ్డును దక్కించుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. ఉత్సవాల్లో ముస్లిం వ్యక్తి భాగం కావడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గ్రామంలో ప్రతిష్ఠించిన గణేశుడి దగ్గర అతడు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం విశేషం. దీంతో ఎండీ పాషాను గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు అభినందించారు.