
జూరాలకు 76,800 క్యూసెక్కుల వరద
ధరూరు/ఆత్మకూర్/రాజోళి/దోమలపెంట: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. గురువారం 92 వేల క్యూసెక్కులు ఉండగా... శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 76,800 క్యూసెక్కులకు చేరినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 4 క్రస్ట్‌గేట్లను పైకెత్తి 27,504 క్యూసెక్కులు దిగువకు, విద్యుదుద్పత్తి నిమిత్తం 41,602, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 620, భీమా లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.261 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి..
జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది రికార్డుస్థాయిలో ఉత్పత్తి కొనసాగుతోంది. మే నెలలోనే విద్యుదుత్పత్తి ప్రారంభించగా.. శుక్రవారం నాటికి 597 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించారు. కాగా ఈ ఏడాది లక్ష్యంగా 610 మి.యూ.గా ఉంది. శుక్రవారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 285.025 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 311.995 మి.యూ. ఉత్పత్తి చేపట్టామని ఎస్‌ఈ శ్రీధర్ వివరించారు.
సుంకేసులకు కొనసాగుతున్న వరద
సుంకేసుల జలాశయానికి శుక్రవారం ఎగువ నుంచి 54 వేల క్యూసెక్కుల వరద రాగా.. 12 గేట్లను మీటర్ మేర తెరిచి 50,484 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు జేఈ మహేంద్ర వివరించారు. అలాగే 2,626 క్యూసెక్కులు కేసీ కెనాల్‌కు వదిలినట్లు పేర్కొన్నారు.
4 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల