
రేపు ఆలయాల మూసివేత
అలంపూర్: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాలను ఆదివారం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్ల ఆలయ తలుపులు మూసివేస్తామని ఆలయ ఈఓ దీప్తి, కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తుల దర్శనాలు సైతం కొనసాగుతాయని, పౌర్ణమిని పురస్కరించుకొని జోగుళాంబ ఆలయంలో చండీహోమాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం నుంచి ఉభయ ఆలయాల తలుపులు మూసివేసి.. సోమవారం ఉదయం ఆలయాల సంప్రోక్షణ తర్వాత 8.30 గంటలకు మహా మంగళ హారతితో ఉభయ ఆలయాల తలుపులు తెరిచి భక్తుల దర్శనాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మన్యంకొండ ఆలయం..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: చంద్రగ్రహణం కారణంగా మన్యంకొండలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు మూసి (ద్వార బంధనం) వేయనున్నట్లు దేవస్థానం చైర్మన్ అలహరి మధుసూదన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి సంప్రోక్షణ, అభిషేకం తర్వాత సోమవారం ఉదయం 9 గంటల నుంచి భక్తులు తిరిగి దర్శనం చేసుకోవచ్చన్నారు.