
వినాయకా..సెలవిక
పాలమూరు/ స్టేషన్ మహబూబ్‌నగర్: మహిళల కోలాటాలు.. పెద్దల చెక్క భజనలు.. యువకుల కర్రసాము.. డప్పుల శబ్ధాలు.. బ్యాండు మేళాలకు అనుగుణంగా తీన్‌మార్ స్టెప్పులు.. మిరుమిట్లు గొలిపే లైట్ల మధ్య గణనాథుడు నిమజ్జనోత్సవం శోభాయమానంగా సాగింది. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకొన్న విఘ్నాధిపతి.. ఇక వెళ్లొస్తా అంటూ గంగమ్మ ఒడికి చేరాడు. శుక్రవారం రాత్రి క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాలయం దాకా.. ఇటు పాత బస్టాండు, రాయచూరు రోడ్డు, జడ్చర్ల హైవే తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపులతో పులకించిపోయాయి. విభిన్న, విచిత్ర రూపాలు, ఆకర్షణీయమైన సెట్టింగ్‌లతో కూడిన తీర్చిదిద్దిన ప్రత్యేక రథాలు అందరినీ అలరించాయి.
● జిల్లాకేంద్రంలో దాదాపు 400 విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివచ్చాయి. స్వాగత వేదిక దగ్గర ఒక్కొ విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి గణనాథులను నిమజ్జనం వైపు కదిలించారు. ఇటూ పాతపాలమూరు, రామందిర్ చౌరస్తా, బ్రహ్మాణవాడి తదితర ప్రాంతాల నుంచి పాన్ చౌరస్తా మీదగా సభా వేదిక దగ్గరకు చేరుకోగా ఏనుగొండ, హౌసింగ్‌బోర్డు, శ్రీనివాసకాలనీ, పద్మావతికాలనీ, వెంకటేశ్వరకాలనీ, టీచర్స్‌కాలనీ, న్యూటౌన్, రాజేంద్రనగర్ వైపు నుంచి వచ్చిన గణనాథులు అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా స్వాగత వేదిక దగ్గరకు చేరుకున్నాయి. సత్యంచౌరస్తా, సంజయ్‌నగర్, బోయపల్లిగేట్, న్యూగంజ్, సుభాష్‌నగర్ ప్రాంతాలకు చెందిన గణనాథులు పాత బస్టాండ్ మీదగా స్వాగత వేదిక వద్దకు చేరుకున్నాయి. క్లాక్‌టవర్ నుంచి పాలకొండ, చిన్నదర్పల్లి, వెంకటాపూర్ చెరువులతో పాటు బీచుపల్లి, రంగాపూర్ వద్ద కృష్ణానదిలో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు తరలించారు. ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్, నిఘా కెమెరాల ద్వారా ప్రత్యేక సిబ్బంది నిఘా పెట్టారు. ఎస్పీ జానకి ఎప్పటికప్పుడు బందోబస్తు, నిఘాను పర్యవేక్షించారు.
● నిమజ్జనం వేడుకల్లో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గణేశ్ చౌక్ వద్ద సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన వేదిక నుంచి గణనాథుల శోభాయాత్రను తిలకించారు. ఈ సందర్భంగా వినాయకులకు ప్రత్యేక జలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్, శ్రీగణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, సభ్యులు నాగరాజు, గోపాల్‌యాదవ్, ఆయా పార్టీల నాయకులు పద్మజారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
● జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం రాత్రి గణేశ్ శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. నేతాజీ చౌరస్తాలో గణనాథులకు ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. అక్కడి నుంచి శోభాయాత్రగా తరలించి నాగసాల చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేశారు.