
చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాకేంద్రంలో శోభాయాత్ర సందర్భంగా 280మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేస్తున్నామని, నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ మైదానంలో శుక్రవారం శోభాయాత్ర విధులు కేటాయించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ప్రదేశాల పరిస్థితులను పర్యవేక్షించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్, రూఫ్‌టాప్ బందోబస్తు, పెట్రోలింగ్, స్ట్రైకింగ్ ఫోర్స్ అమలు చేయాలన్నారు. మఫ్టీలో 20 మంది స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బందిని నియమించి అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలన్నారు. డీజేలు, లేజర్ లైట్స్, పేపర్ సెల్ యంత్రాలకు అనుమతి లేదనే విషయం తెలియ చెప్పాలన్నారు. ప్రజలతో సహనంతో, ప్రశాంతంగా వ్యవహరించాలన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలు సౌకర్యంగా ప్రయాణం చేయడానికి భారీ వాహనాలు, ఇతర వాహనదారులను డైవర్షన్ చేసిన పాయింట్ల వైపు మళ్లించాలన్నారు. చెరువుల దగ్గర నిమజ్జనం కోసం వచ్చే వాహనాలను క్యూలైన్‌లో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, చివరి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు డ్యూటీలో ఉండే పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు ఎన్‌బీరత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఎస్‌బీ సీఐ వెంకటేష్, సీఐలు ఇజాజుద్దీన్, అప్పయ్య, గాంధీనాయక్, శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ ఇతర ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.