
ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
ఇటిక్యాల: ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇటిక్యాల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవినాయక్ కథనం మేరకు.. మండలంలోని చాగాపురం గ్రామానికి చెందిన కుర్వ రాముడు (50) కొంత కాలంగా మద్యానికి బానిసై ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మనస్థాపానికి గురై తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు. అతని భార్య కుర్వ సుజాత ఫిర్యాదు మేరకు బుధవారం సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కొల్లాపూర్ రూరల్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లాపూర్ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన భాస్కర్ (35) బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని వాగు దగ్గరకు బహిర్భూమికి వెళ్తుండగా, అక్కడే వేలాడుతున్న విద్యుత్ తీగలు తలకు తాకి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని విద్యుత్ అధికారులు పరిశీలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న డాక్టర్లు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. భాస్కర్‌కు భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కేఎల్‌ఐ కాల్వలో పడి
రైతు మృతి
గోపాల్‌పేట: పొలం సమీపంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వలో పెట్టిన మోటారు చుట్టూ చేరిన నాచును తీసేందుకెళ్లి రైతు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రేవల్లి మండలంలోని తల్పునూరు గ్రామానికి చెందిన చాగల రాములు (58) బుధవారం ఉదయం ఎప్పటిలాగే పొలానికి వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆందోళన చెందిన ఆయన చిన్న కుమారుడు ఆంజనేయులు మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాములు ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి పొలం వద్దకు వెళ్లి వెతికినా ఎక్కడా కనిపించలేదు. కేఎల్‌ఐ కాల్వలో ఉన్న వారి మోటారు వద్ద చూడగా నీటిపై తేలుతూ రాములు మృతదేహాం కనిపించింది. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై రేవల్లి ఎస్‌ఐ రజితను వివరణ కోరగా.. రాములు కుటుంబ సభ్యులు మృతికి సంబంధించి సమాచారం ఇచ్చారని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు. మృతుడు భార్య మణెమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
దేవరకద్ర రూరల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగన్న కథనం మేరకు వివరాలిలా.. గూరకొండ సమీపంలోని కుర్వ శ్రీను రైస్‌మిల్లు వద్ద ఉన్న గదిలో రక్తపు మరకలు, ఫోన్ పడి ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకొని లభించిన ఆధారాలతో విచారణ చేయగా.. అవి ఊట్కూర్ మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన రాములు(60)విగా గుర్తించారు. వెంటనే విషయాన్ని సదరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు స్థానికుల సహాయంతో చుట్టుపక్కల రాములు కోసం వెతకగా.. పెద్దగోప్లాపూర్ దగ్గర రోడ్డు పక్కన పండ్ల షాపు వెనకల గాయాలతో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు.

ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య