
‘జీవిత బీమా’తో ఆర్థిక భద్రత
జడ్చర్ల టౌన్: ప్రతి ఒక్కరికీ జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించి వారికి ఆర్థిక భద్రతను ఇవ్వడమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశమని ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా ముంబై సెంట్రల్ కార్యాలయ క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే అన్నారు. బుధవారం జడ్చర్ల ఎల్‌ఐసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జడ్చర్ల ఎల్‌ఐసీ బ్రాంచ్ పరిధిలోని కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన సందర్భంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా సదుపాయం కల్పించాలనే సంకల్పంతో 1956లో కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ ప్రారంభించిందన్నారు. నాటి నుంచి ఎంతగానో విస్తరించినా ఇంకా అనేక మందికి పాలసీని అందించలేక పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కేశంపేట మండలాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికి చేసి ప్రతి ఇంట్లో ఒక పాలసీ నినాదంతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించారు. ఎల్‌ఐసీ కుటుంబమంతా విశేషంగా కృషి చేసి ప్రాజెక్ట్‌ను విజయవంతం చేయాలన్నారు. 2026 మార్చి 26 నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైదరాబాద్ జోనల్ మేనేజర్ పునీత్‌రాజ్‌కుమార్, డివిజనల్ మేనేజర్ సంధ్యారాణి, క్లియా ఆర్‌ఎం రాజశేఖర్, ఎంఎం ప్రసాదరావు, మేనేజర్ రవిశంకర్, బీడీబీఎస్ మేనేజర్ జగన్నాథం, జడ్చర్ల బ్రాంచ్ మేనేజర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పైలెట్ ప్రాజెక్ట్‌గా కేశంపేట మండలం ఎంపిక
ప్రతి ఇంట్లో ఒక పాలసీ ఉండాలి
ఎల్‌ఐసీ ఆలిండియా క్లియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైక్రే