
మానసిక దివ్యాంగులను మనసుతో చూడాలి
మహబూబ్‌నగర్ రూరల్: మానసిక దివ్యాంగులను మనసుతో చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. జిల్లా కేంద్రం టీచర్స్ కాలనీలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలను జడ్జి సందర్శించి న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేవా అని పాఠశాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అఽధికారులకు సూచించారు. అలాగే సమస్యలుంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. దివ్యాంగుల తల్లిదండ్రులకు వైకల్యం ఉన్న పిల్లలను ఉత్సాహం, ధైర్యం కలిగించడం కోసం లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ మనోన్యాయ, దివ్యాంగన్ కౌశల్ వికాస్, దివ్యాంగన్ రోజ్‌గార్ సేతు వంటి స్కీం అందుబాటులో ఉన్నాయన్నారు. బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మానసిక దివ్యాంగులకు ఒక ఆలయం లాంటిదన్నారు. ఇక్కడి పిల్లలు విద్యాబుద్ధులతోపాటు ఒకేషనల్, కంప్యూటర్ శిక్షణ మొదలగునవి పొందుతున్నారని, రోజువారి దినచర్యలో చేపట్టే కార్యక్రమాలు, ఫిజియోథెరపి, స్పీచ్‌థెరపి, బిహేవర్ మోడిఫికేషన్ చేస్తున్నారని తెలిపారు. వీటిద్వారా మానసిక దివ్యాంగులు సెరిబ్రల్ పాలసీ చిల్డ్రన్స్ ఫిజియోథెరపి ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ఈ విధమైన శిక్షణ ఇవ్వడం ద్వారా పిల్లల్లో మనోధైర్యంతోపాటు తెలివితేటలు కూడా మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకుడు గన్నోజు చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి ఇందిర