
రేపు మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి విగ్రహావిష్కరణ
● హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత, ఈ ప్రాంత అభివృద్ధి కోసం దివంగత మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థిదశ నుంచి రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం పార్టీకి చెందిన ఇతర నాయకులతో కలిసి కొల్లాపూర్ నుంచి నారాయణపేట, అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రలు చేసినట్లు తెలిపారు. ఈనెల 4న గురువారం జిల్లా కేంద్రం పద్మావతీకాలనీలోని గ్రీన్‌బెల్టులో మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి విగ్రహాష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, నాయకులు సంజీవ్ ముదిరాజ్, వినోద్‌కుమార్, చంద్రకుమార్‌గౌడ్, సీజే బెనహర్, సిరాజ్‌ఖాద్రీ, రాజేందర్‌రెడ్డి, గోపాల్‌యాదవ్, జహీర్ అఖ్తర్, లింగం నాయక్, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.