
ధర్నాలు.. రాస్తారోకోలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు జడ్చర్ల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన మేఘావత్‌వాల్యానాయక్. తనకున్న 20 ఎకరాల్లో వరిపంట సాగుచేస్తున్నాడు. ఇప్పటి వరకు తిరిగి తిరిగి 10 బస్తాల యూరియాను తీసుకెళ్లాడు. మరో 10 బస్తాల యూరియా అవసరం ఉంది. దీంతో కుటుంబసభ్యులతో కలిసి ఆగ్రో రైతు సేవాకేంద్రం వద్దకు రోజూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. 10 రోజులుగా తిరుగుతున్నా యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోతున్నాడు. యూరియా వేయక పైరు పాడైపోతుందని ఆయన వాపోతున్నాడు.
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/ జడ్చర్ల/ జడ్చర్లటౌన్/ దేవరకద్ర/ నవాబుపేట/ హన్వాడ: జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత వేధిస్తోంది. ప్రభుత్వ వైఫల్యమో.. అధికారుల అలసత్వమో.. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలడమో.. కారణం ఏదైనా కానీ, రైతులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో యూరియా కోసం రైతులు పడే తిప్పలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు క్యూకడుతున్నారు. యూరియా కోసం గంటల తరబడి రైతులు, మహిళలు క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి దాపు రించింది. ఈ క్రమంలో యూరియా కోసం రైతుల నిరసనలు, ధర్నాలతో మంగళవారం జిల్లా అట్టుడికింది.
జాతీయ రహదారిపై రాస్తారోకో
దేవరకద్రకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే వచ్చిన రైతులు రోడ్లపై తిరుగుతూ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తూ కనిపించారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు రైతులను రెచ్చగొట్టడంతో కొత్త బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారిపైకి వచ్చి నినాదాలు చేశా రు. ఉదయం 6గంటల నుంచి దాదాపు గంట పాటు రాస్తారోకో చేయడంతో రాయిచూర్– మహబూబ్‌నగర్ రహదారికి ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. విష యం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో అక్కడి కి వ్యవసాయాధికారి రావడంతో రైతులు వారిని నిలదీశారు. యూరియా ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని భీష్మించి కూర్చున్నారు. అయితే రైతులను సముదాయించి పీఏసీఎస్ వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత యూరియా ఇస్తామని చెప్పడంతో రైతులు పీఏసీఎస్ వద్దకు పరుగులు తీశారు. అక్కడ తోపులాటల మధ్య రైతులు టోకెన్లు తీసుకున్నారు.
రోజంతా పడిగాపులు
నవాబుపేటలో యూరియా కోసం రైతులు రోజంతా పడిగాపులు కాయాల్సి వచ్చింది. స్థానిక కొండాపూర్ చౌరస్తాలో రైతులు నిరసనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యారియా వచ్చే దాకా ఆందోళన చెస్తామని తేల్చిచెప్పడంతో ఎస్‌ఐ విక్రమ్, మండల వ్యవసాయాధికారి కృష్ణకిషోర్‌తో వచ్చి మాట్లాడారు. రాత్రి వరకు స్థానిక పీఏసీఎస్‌కు యూరియా వస్తుందని, బుధవారం పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. స్టాకు రావడంతో బుధవారం ఉదయమే యూరియా పంపిణీ చేస్తారనే ఉద్దేశంతో కొందరు రైతులు నవాబుపేట పీఏసీఎస్ కేంద్రం రాత్రి నుంచే వేచి ఉన్నారు.
వర్షంలోనూ రైతుల నిరీక్షణ
హన్వాడ తెల్లవారుజాము నుంచే రైతుసేవా సహకారం కేంద్రం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం యూరియా అందుబాటులో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సాయంత్రం మూడు లారీల యూరియా రావడంతో ఒక్కసారిగా 1,500 మంది రైతులు ఎగబడ్డారు. పోలీసులు వచ్చి క్యూలైన్లు ఏర్పాటు చేయించి.. యూరియా ఇప్పించారు. వర్షం పడుతున్నా.. క్యూలైన్‌లో వేచి ఉన్నారు.
ఎన్నాళ్లీ నిరీక్షణ