
13న జాతీయ లోక్ అదాలత్
పాలమూరు: జిల్లా ప్రధాన కోర్టుతో పాటు జడ్చర్లలో ఈనెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జాతీయ లోక్ అదాలత్‌పై వివరాలు వెల్లడించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, ఇప్పటి వరకు కోర్టు ముందుకు రాని కేసులు పరిష్కరించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు లోక్ అదాలత్‌కు పంపిన తర్వాత పరిష్కారం అయితే చెల్లించిన కోర్టు ఫీజు సైతం కక్షిదారులకు తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు తక్షణ పరిష్కారం పొందవచ్చునని, దీంతో ఇరువర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు. డబ్బు వృథా కాకుండా ఈ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయని తెలిపారు. క్రిమినల్, సివిల్, భూతగాదాలు, డబ్బు రికవరీ, రోడ్డు ప్రమాదాలు, చిట్‌ఫండ్, విద్యుత్, ప్రిలిటిగేషన్ కేసులు, ఈ–పెట్టీ, డ్రంకెన్‌డ్రైవ్, చెక్ బౌన్స్, బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్, ఇన్సూరెన్స్, స్పెషల్ ఎన్‌ఐ యాక్ట్ కేసులు రాజీ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆరు బెంచీలు, జడ్చర్లలో రెండు బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 1,748 కేసులను గుర్తించి కక్షిదారులకు నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో న్యాయమూర్తి డి.ఇందిర పాల్గొన్నారు.
ఇద్దరు సీఎంలు కలిసి కేసీఆర్‌పై కుట్ర
జడ్చర్ల: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను ఎలాగైనా బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే సీబీఐకి అప్పగించిందన్నారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ జేబు దర్యాప్తు సంస్థలని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రికి రాత్రి సీబీఐకి కేసును అప్పగించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించే కుట్రలో భాగమే ఈ కేసు అన్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన బీఆర్‌ఎస్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. గత కాంగ్రెస్ పాలనలో కనీసం తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన దాఖలాలు లేని పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ఇలాంటి నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా తాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. డ్రామాలు చేస్తున్నారని పాలకులు అంటున్నారని మండిపడ్డారు. తమ పాలనలో ఎక్కడా యూరియా కష్టాలు రానివ్వకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం రేవంత్‌కు పరిపాలన చేయడం రావడం లేదన్నారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనే ఎక్కువ కాలం ఉంటున్నారన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
కవితను సాగనంపడం సబబే..
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం సబబేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులైనా సహించేది లేదంటూ గతంలోనే అధినేత కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. దీంతో పార్టీ కంటే ఎవరూ పెద్ద కారన్నది స్పష్టమైందని అన్నారు. ఆనాడు తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్.. నేడు పార్టీ పరిరక్షణ కోసం కన్నబిడ్డనే పార్టీ నుంచి బహిష్కరించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు.

13న జాతీయ లోక్ అదాలత్