
6న ‘సివిల్ సర్వీసెస్’క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌లో పాల్గొనే జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపికలను ఈనెల 6న స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో పాటు ఉదయం 7.30 గంటలకు స్టేడియంలో అథ్లెటిక్స్ కోచ్ సునీల్‌కుమార్ (9440656162) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి ఎంపికలు ఉంటాయని ఆయన తెలిపారు.
యూరియాపై ప్రతిపక్షాల రాద్ధాంతం
దేవరకద్ర: యూరియాపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన దేవరకద్రలో విలేకరులతో మాట్లాడారు. కావాలని సమస్యను సృష్టిస్తున్నాయని భూత్పూర్‌లో కూడా తూతూ మంత్రంగా ధర్నాలు చేశారని విమర్శించారు. రైతులు లేకుండా వారి కార్యకర్తలతో ధర్నాలు చేస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అక్కడక్కడ చిన్నచిన్న కొరత ఏర్పడుతుందని, అది కూడా లేకుండా చూడాలని అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో ఎలాంటి కొరత లేకుండా యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు. రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసిన తాను రైతులకు కొరత లేకుండా చూస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రాక్టికల్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. చైన్ సర్వే, టోటల్ సర్వే వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ హద్దుల గుర్తింపు, సర్వే నంబర్లలోని సబ్‌డివిజన్ సమస్యపై చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా మొదటి బ్యాచ్ 98 మంది అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో భూ సర్వేపై శిక్షణ అందించి పరీక్షలు నిర్వహించారు. రెండో బ్యాచ్ 132 మంది అభ్యర్థులకు గాను 109 మంది ఏనుగొండ శివారు బైపాస్ సమీపంలో క్షేత్రస్థాయి శిక్షణకు హాజరవుతున్నారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎండీ మూసా, రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి భూసర్వేపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. రెండో బ్యాచ్ శిక్షణ ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 22 వరకు కొనసాగనుంది. శిక్షణ అనంతరం ఈ నెల 23న పరీక్ష నిర్వహించి.. ఇందులో అర్హత సాధించిన వారికి లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా సర్టిఫికెట్లు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించుకోనున్నారు.