
నేడు సీఎం రేవంత్ పర్యటన
● వేముల ఎస్‌జీడీ ఫార్మా పరిశ్రమ రెండో యూనిట్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ క్రైం/ అడ్డాకుల: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండో యూనిట్‌ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కంపెనీ ముందున్న స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. అలాగే పరిశ్రమ లోపల జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు 1.45 గంటల పాటు సీఎం ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. కాగా.. కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్ ద్వారా మరో 200 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
956 మందితో భద్రతా ఏర్పాట్లు
ఎస్‌జీడీ ఫార్మాలో రెండో యూనిట్ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి రానుండటంతో ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిప్యాడ్, ట్రాఫిక్, వీఐపీ రాకపోకల మార్గాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఆయా విభాగాల నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి పోలీస్ బలగాలు విధులు నిర్వహించడానికి వేములకు చేరుకున్నారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 69 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 173 మంది, కానిస్టేబుళ్లు 461 మంది, మహిళా సిబ్బంది 129, హోంగార్డులు 89 మందికి విధులు కేటాయించారు.

నేడు సీఎం రేవంత్ పర్యటన