
అతివేగమే ప్రమాదానికి కారణమా..?
మహబూబ్‌నగర్ క్రైం/అడ్డాకుల: అడ్డాకుల మండల సమీపంలోని కాటవరం స్టేజీ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. అయితే ట్రెయిలర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సును డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణంగా తెలుస్తోంది. ప్రమాదం ప్రయాణికులు ఎక్కించే డోర్ వైపు జరగడం వల్ల డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు ముందు వరుస భాగంలో కూర్చున్న వారికే ఎక్కువ నష్టం జరిగింది. లారీ వెనుక బస్సు ఢీకొట్టిన సమయంలో బస్సు లెఫ్ట్ సైడ్ ఎక్కువ భాగం లోపలి వరకు దెబ్బతింది. దీంతో పాటు చాలా వరకు లారీలను రాత్రివేళ దాబాల వద్ద నిలుపుతుంటారు. అయితే ప్రమాద స్థలం వద్ద కూడా దాబా హోటల్ ఉండటంతో లారీని ఇక్కడ నిలిపేందుకు డ్రైవర్ దాన్ని స్లో చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
మధ్య తరగతి కుటుంబాలే..
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో హసన్ పెయింటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఇతడి మృతితో పిల్లలు అనాథలుగా మారారు. నంద్యాలకు చెందిన అస్రాప్ ఉన్నీసా హైదరాబాద్‌లోని హాఫీజ్ పేట్‌లో ఉండే కొడుకు ఫిరోజ్ భాష దగ్గరి నుంచి నంద్యాలకు వెళ్తూ మృతి చెందింది. నంద్యాలకు చెందిన సుబ్బరాయుడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఎల్లమ్మ హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కొడుకును చదివిస్తోంది. ఆమె కుమారుడు పదేళ్ల సంతోష్ నాలుగో తరగతి చదువుతుండగా.. ఇటీవల తండ్రి కూడా చనిపోవడంతో అనాథగా మారాడు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు