
పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి
● జోగుళాంబ జోన్– 7
డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్
వనపర్తి: పోలీసులు ఎల్లవేళలా స్టేషన్లలో అందుబాటులో ఉండి బాధితులకు రక్షణగా ఉండాలని జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం ఆయన జిల్లాలోని పెబ్బేరు, చిన్నంబావి, పెద్దమందడి పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేశారు. అంతకముందు ఎస్పీ రావుల గిరిధర్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెన్ బ్యారెక్, టెక్నీకల్ రూం, పరిసరాలను పరిశీలించారు. ఎక్కువగా జరిగే నేరాలు, వాటి ప్రాంతాలు, కేసుల నమోదు వివరాలు, నేరస్తుల ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయా స్టేషన్ల ఎస్‌ఐలతో ఆరా తీశారు. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతి పోలీసు నిబద్ధతతో ఉండాలని, తమకు కేటాయించిన విధిని సక్రమంగా నిర్వహించినప్పుడే అధికారులు, ప్రజల నుంచి మన్ననలు పొందుతారని, చేసిన పనికి గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు కృష్ణయ్య, రాంబాబు, ఎస్‌ఐలు యుగంధర్‌రెడ్డి, జగన్, శివకుమార్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.