
కొత్త కార్డులకు ‘రేషన్’
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో పాత కార్డుదారులతో పాటు కొత్తగా మంజూరైన కార్డుదారులకూ సెప్టెంబర్ 1 నుంచి చౌకధర దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. వర్షాకాలంలో వరదలు, వర్షాల నేపథ్యంలో పేదలు రేషన్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేసింది. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్న బియ్యం పంపిణీ కొనసాగనుంది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం మండల లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల నుంచి చౌకధర దుకాణాలకు చేరుతున్నాయి. జిల్లాలో 2,64,953 ఆహార భద్రత కార్డులు ఉండగా, అందులో 9,07,730 మంది కుటుంబ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి కొత్తగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తుంది. అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా కొత్తగా 26,331 కార్డులు మంజూరు కాగా, కార్డుల్లో 1,27,473 మంది సభ్యులుగా చేరారు. ఈ నేపథ్యంలో 506 చౌకధర దుకాణాల ద్వారా 5,781 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సెప్టెంబర్ 1 నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు.
● ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే సన్నబియ్యం పంపిణీ సెప్టెంబర్ మాసం నుంచి కొత్త పంథాలో సాగనుంది. వచ్చేనెల నుంచి కార్డుదారులకు బియ్యాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో అందించనున్నారు. పర్యావరణహితంగా గుడ్డ, కాగితంతో తయారు చేసిన చిన్న సంచుల్లో బియ్యాన్ని అందించేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకునేలా తయారు చేయించిన బ్యాగులను ఆహార భద్రత కార్డుదారులకు అందించనున్నారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలతో బ్యాగులు
ఆహార భద్రత పథకంలో భాగంగా రేషన్ బియ్యాన్ని అందించే సంచులపై సీఎం, డిప్యూటీ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను వస్త్ర సంచులపై ఒక వైపున ముద్రించగా, మరోవైపున హస్తం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాల వివరాలను ముద్రించారు. మాజీ ప్రధాని ఇందిర ఫొటో, కింద అందరికీ సన్న బియ్యం, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అనే కాప్షన్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అని ముద్రించారు.
నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ
ఈ సారి బియ్యంతో పాటు చేతి సంచి ఉచితం
జిల్లాలో 26,331 కుటుంబాలకు కార్డులు మంజూరు