
కోర్టుకు హాజరైన తేజేశ్వర్ హత్య కేసు నిందితులు
బెయిల్‌పై న్యాయవాదిని వాకాబు చేసిన ఏ–7
గద్వాల క్రైం: జూన్17వ తేదీన గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్‌చేతిలో దారుణహత్యకు గురైన ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే. అయితే గురువారం జిల్లా జైల్‌లో రిమాండ్‌లో ఉన్న నిందితులు ఏ– 1 తిరుమలరావు, ఏ– 2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ –3 కుమ్మరి నగేశ్, ఏ–4 చాకలి పరశురాముడు, ఏ–5 చాకలి రాజు, ఏ–6 ఏ మోహన్, ఏ–7 తిరుపతయ్య(తిరుమల రావు తండ్రి), ఏ–8 సుజాతను గద్వాల జూనియర్ సివిల్ కోర్టు నాయ్యమూర్తి ఉదయ్‌నాయక్ ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన అంశాలపై మరోసారి న్యాయమూర్తి నిందితులతో మాట్లాడారు. జైలు అధికారులు ఏమైనా ఇబ్బందులు, ఆహార పానీయాలు అందించే విషయంలో నిర్లక్ష్యం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన వాదనలకు న్యాయవాదులను ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నించారు. అనంతరం నిందితులకు మరో 14రోజుల పాటు రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు నిందితులను జైలుకు తరలించారు. రిమాండ్‌కు తరలించే క్రమంలో ఏ–7 తిరుపతయ్య తన తరఫున ఏర్పాటు చేసుకున్న న్యాయవాదితో బెయిల్ విషయంపై వాకబు చేశారు. నేడో రేపో బెయిల్ బెంచ్ మీదకు వస్తుందని త్వరలోనే బెయిల్ వస్తుందని న్యాయవాది తెలిపారు. నిందితులంతా కోర్టులో హాజరవుతున్నారని తెలుసుకున్న బంధువులు కోర్టు వద్దకు చేరుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని కన్నీంటిపర్యమయ్యారు.
ఇద్దరు నిందితులను కస్టడీకి కోరిన పోలీసులు
హత్య కేసు ఘటనలో ఇద్దరు నిందితులైన ఏ–1 తిరుమలరావు, ఏ– 2 ఐశ్వర్య అలియాస్ సహస్రను పోలీసులు కస్టడీకి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై త్వరలో న్యాయమూర్తి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసు వ్యవహారంలో ఈనెల 10న ఏ –1, 3, 4, 5ను మూడు రోజులపాటు వివిధ అంశాలపై విచారణ అధికారి సీఐ శ్రీను విచారించి రిమాండ్‌కు తరలించారు.