
మరో నాలుగు..!
ఉమ్మడి పాలమూరులో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు
కోస్గి లేదా అయిజ..
ప్రస్తుత నారాయణపేట జిల్లా, కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్, పరిగి నియోజకవర్గంలోని గండేడ్ కలుపుకొని కోస్గి అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలాన్ని కూడా కలిపే చాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో జోగుళాంబ గద్వాల జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజకు చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, రాజోళి, గద్వాల నియోజకవర్గంలోని గట్టు కలిపి అయిజ నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పెబ్బేరు
వనపర్తి జిల్లా, ఆ నియోజకవర్గంలో ఉన్న పెబ్బేరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల పరిధిలో రెండేసి మండలాలను దీని పరిధిలో చేరుస్తారని అంచనా. 2011 లెక్కల ప్రకారం పరిశీలిస్తే ఆయా మండలాలు/పట్టణంలో జనాభా 2,12,253. సగటు జనాభా 2,30,064లో పదిశాతం తీసేసి పోలిస్తే.. జనాభా కొంత ఎక్కువగానే ఉంది. దీంతో పాటు పెబ్బేరు, కొత్తకోట జాతీయ రహదారి 44ను ఆనుకుని ఉండడడంతో ఈ నియోజకవర్గ ఏర్పాటు ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.
మండలం జనాభా
పెబ్బేరు (వనపర్తి) 48,749
కొత్తకోట (దేవరకద్ర) 59,331
శ్రీరంగాపూర్ (వనపర్తి) 19,941
వీపనగండ్ల (కొల్లాపూర్) 27,378
చిన్నంబావి (కొల్లాపూర్) 28,949
మదనాపురం (దేవరకద్ర) 27,905
మొత్తం 2,12,253
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు పూర్తి చేసి.. డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవలే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనను నెమరువేసుకుంటూ.. ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ మేరకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యే ఆశావహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు.. మారనున్న నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
రాష్ట్రం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గంలో ఉండాల్సిన సగటు జనాభాను నిర్ణయిస్తారు. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటు జనాభా 2,30,064 (పది శాతం జనాభా తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చు). దీని ప్రకారం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు చేరుకోనున్నాయి. ఈ లెక్కన 34 నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జనాభా 40,53,028 (2011 లెక్కల ప్రకారం) ఉండగా.. 14 అసెంబ్లీ స్థానాలు 18కి చేరుకోనున్నాయి.
● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు (షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్. దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్, కొడంగల్, గద్వాల, అలంపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట) ఉన్నాయి. పునర్విభజన చేపడితే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయి. ఇందులో పెబ్బేరు/కొత్తకోట, ఆమనగల్, మహబూబ్‌నగర్ రూరల్ ఖాయమని.. కోస్గి, అయిజలో ఏదైనా ఒకటి కొత్త నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ ఐదు జిల్లాలుగా (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల) విడిపోగా.. పలు నియోజకవర్గాలు, మండలాలు రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వాటిని ఒకే జిల్లా పరిధిలోకి తీసుకురానున్నారు.
ఆమనగల్
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆమనగల్, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలు జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డికి వెళ్లాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ మండలాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం కలిసి ఆమనగల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 2011 సగటు జనాభాతో పాటు భౌగోళికంగా సరిపోనుండడంతో కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తి మండలం మిగలగా.. ఈ నియోజకవర్గంలో అచ్చంపేట నుంచి వంగూరు, చారకొండ.. జడ్చర్ల నుంచి ఊర్కొండ, నాగర్‌కర్నూల్ నుంచి తాడూరు మండలాలను చేర్చే అవకాశం ఉంది.
మండలం జనాభా
ఆమనగల్ (కల్వకుర్తి) 62,034
మాడ్గుల (కల్వకుర్తి) 49,133
తలకొండపల్లి (కల్వకుర్తి) 52,835
కడ్తాల్ (కల్వకుర్తి) 36,406
వెల్దండ (కల్వకుర్తి) 46,006
మొత్తం 2,46,414
ముఖ్యనేతల నజర్
2027 మార్చి నాటికి దేశవ్యాప్తంగా జనగణన పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలల్లో నియోజకవర్గాల డీలిమిటేషన్ తతంగం ముగించేలా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 2028 నవంబర్ లేదా డిసెంబర్‌లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు 23కు చేరుకుంటాయి. దీని తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా 18 నియోజకవర్గాలతో రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలవనుంది. పునర్విభజనతో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో వివిధ పార్టీల ముఖ్య నేతలు, ఆశావహులు కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై దృష్టి సారించారు. తమ కుటుంబసభ్యులను రాజకీయారంగేట్రం చేసేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
నూతనంగా పెబ్బేరు, ఆమనగల్, మహబూబ్‌నగర్ రూరల్ ఖాయం
కోస్గి లేదా అయిజలో ఏదైనా ఒక్కటి..
రాష్ట్రంలో రంగారెడ్డి తర్వాత 18 సీట్లతో రెండోస్థానంలో జిల్లా..
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మారనున్న భౌగోళిక సరిహద్దులు
2027 మార్చిలో కొత్త జనాభా లెక్కలు రాగానే డీలిమిటేషన్ ప్రక్రియ షురూ

మరో నాలుగు..!

మరో నాలుగు..!

మరో నాలుగు..!