
పర్యవేక్షించేది ఎవరో?
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో పారిశుద్ధ్యంపై మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేక వివిధ ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి మహబూబ్‌నగర్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గత జనవరి 27న కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. ఇందులో భాగంగా జైనల్లీపూర్, దివిటిపల్లిలను విలీనం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే డివిజన్ల విభజన ప్రక్రియ పూర్తయి గెజిట్ సైతం విడుదలైంది. గతంలో 49 వార్డులు ఉండగా ప్రస్తుతం 60 డివిజన్లకు పెరిగింది. ఇప్పటికే నగర జనాభా మూడు లక్షలు దాటగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
● ఇదిలా ఉండగా సుమారు మూడేళ్లుగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న గురులింగం, రవీందర్‌రెడ్డి, వాణికుమారికి గత నెల 23న పదోన్నతి లభించింది. దీంతో ఈ ముగ్గురు అధికారులు వేరే జిల్లాలకు బదిలీపై వెళ్లడంతో అప్పటి నుంచి ఈ విభాగానికి హెల్త్ అసిస్టెంట్ (బీడీఆర్)గా వ్యవహరిస్తున్న వజ్రకుమార్‌రెడ్డి ఒక్కరే దిక్కయ్యారు. మరోవైపు నగరంలోని 49 పాత వార్డులను మూడు జోన్లుగా విభజించడంతో గతంలో పై నలుగురూ పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఏకంగా మూడు పోస్టులు ఖాళీ కావడంతో ఆయా ప్రాంతాలను తరచూ తనిఖీ చేసేవారే కరువయ్యారు. ప్రస్తుతం కిందిస్థాయిలో 18 మంది జవాన్లు ఉన్నా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. వీరిపై ఆజమాయిషీ చేసేవారు లేకపోవడంతో ఎక్కడికక్కడే చెత్తాచెదారం పేరుకుపోతోంది. ఇక నిబంధనల ప్రకారం పది వేల జనాభాకు 28 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి. ఆ లెక్కన 840 మంది అవసరమవుతారు. అయితే 423 మందే ఉండగా వీరిలోనూ సుమారు 35 మంది కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో కేవలం 388 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. వీరితో అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచడం కష్టసాధ్యమేనని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రమే!
ఒకేసారి ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పదోన్నతిపై బదిలీ
హెల్త్ అసిస్టెంట్‌తోనే సరిపెట్టిన రాష్ట్ర ఉన్నతాధికారులు
6 నెలల క్రితమే కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన పాలమూరు
నగరంలో 3 లక్షలు దాటిన జనాభా.. ఎక్కడబడితే అక్కడ చెత్త