
దేవరకద్ర మార్కెట్‌కు రాయచూర్ ఉల్లి
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌కు ఉల్లి కొరత ఏర్పడడంతో పలువురు వ్యాపారులు రాయచూర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మొదటి వారం వరకు ఉల్లి సీజన్ కొనసాగింది. ప్రతివారం వేలాది బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చేది. దీంతో ఉల్లి కొరత ఏర్పడలేదు. నాలుగు వారాలుగా మార్కెట్‌కు ఉల్లి రావడం తగ్గిపోయింది. రైతులు ఇప్పటికే ఉన్న ఉల్లినంతా అమ్ముకోవడంతో అక్కడక్కడా దాచుకున్న రైతులు మాత్రమే అమ్మకానికి తెస్తున్నారు. ఉల్లి కొరతను దృష్టిలో పెట్టుకుని కొందరు వ్యాపారులు రాయచూర్ నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని దేవరకద్ర మార్కెట్‌కు తరలించి వేలంలో పెట్టి విక్రయాలు సాగించారు. బుధవారం జరిగిన వేలంలో నాణ్యమైన ఉల్లికి గరిష్టంగా రూ.2,050, కనిష్టంగా రూ.1400 ధర పలికింది. చిన్నసైజు పాత ఉల్లికి గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.700 వరకు ధరలు పలికాయి. రాయచూర్ నుంచి రూ.వెయ్యికి క్వింటా తెచ్చిన ఉల్లికి వేలం వేయగా రూ.1400 వరకు ధర వచ్చింది.