
సీడ్ పత్తి రైతుల ఆగ్రహం
అయిజ: విత్తన పత్తి రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతులు బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం శివారులో బింగుదొడ్డి సమీపంలో రోడ్డెక్కారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు సంబంధించిన సీడు పత్తిని సాగుచేసే రైతులు గద్వాల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపడంతో 5గంటల సేపు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విత్తన పత్తి విత్తనాలను రైతులకు అందజేసే ఆర్గనైజర్లు, వివిధ కంపెనీల యజమానులు రైతులకు నష్టం చేకేర్చేవిధానాన్ని అమలు చేస్తున్నారని సీడు పత్తి రైతులు వాపోయారు. ఆర్గనైజర్లు అందజేసిన విత్తన పత్తిని సాగుచేశామని, పూత దశకు వచ్చిన అనంతరం ఎకరానికి కేవలం 2క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీలు ప్రకటించారని మండిపడ్డారు. విత్తనాల కొనుగోలు విషయంలో సీలింగ్ విధానం చేపట్టడమంటే రైతుల గొంతులు నిలువునా కోయడమేనన్నారు. రైతు పండించిన విత్తనాలన్నింటిని ఎలాంటి షరుతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తరలివచ్చిన అధికారులు
ఘటనా స్థలానికి తహసీల్దార్ జ్యోతి రెవెన్యూ బృందంతో కలిసి చేరుకున్నారు. అదేవిధంగా ఎస్సై శ్రీనివాసరావు పోలీస్ బృందంతో వెళ్లారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, గురువారం కలెక్టరేట్‌లో ఆర్గనైజర్లు, కంపెనీ యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తామని రైతులు వచ్చి వారి సమస్యను తెలియజేయాలని తహసీల్దార్ రైతులకు చెప్పారు. ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు రోడ్డుపై నుంచి వెళ్లలేదు. రైతులను కంట్రోల్ చేయడానికి సీఐ టాటాబాబు, డీఎస్పీ మెగిలయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఆర్గనైజర్లు మోసం చేశారు
సీడు పత్తి విత్తనాలు ఇచ్చి ఆర్గనైజర్లు రైతులను మోసం చేశారు. నేను 2ఎకాలు సీడుపత్తిని సాగుచేశా. ఇప్పుడు పూత దశకు చేరుకుంది. ఎకరాకు కేవలం రెండు క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటున్నారు. ఆర్గనైజర్లు రైతులను నిలువనా మోసం చేశారు.
– నాగరాజు, సీడుపత్తి రైతు
ముందే చెప్పాలి
విత్తనపత్తి సాగుకు అప్పు చేశాం. క్రాసింగ్ చేయించేందుకు కూలీలకు డబ్బు చెల్లించాం. పెట్టుబడులు పెట్టాం. తీరా పూతకొచ్చే సమయానికి ఎకరానికి రెండు క్వింటాళ్లు మాత్రమే కొంటామంటున్నారు. ఆ విషయం సాగుకు ముందే చెప్పాలి. – దొడ్డెన్న, సీడుపత్తి రైతు
మొత్తం విత్తనాలు కొనాలి
రైతు పండించిన సీడు పత్తి విత్తనాలను ప్రతి సంవత్సరం మొత్తం కొనేవారు. ఈ ఏడాది కేవలం ఎకరానికి రెండు క్వింటాళ్లు కొంటామంటున్నారు. ఆ విధంగా చేస్తే రైతులు పూర్తిగా నష్టపోతారు. రైతులు ఎన్ని క్వింటాళ్లు పండిస్తే అన్ని క్వింటాళ్లను కొనుగోలు చేయాలి.
– ఉలిగన్న, సీడుపత్తి రైతు
రహదారిపై బైఠాయించి రాస్తారోకో
ఆర్గనైజర్లు, సీడ్ కంపెనీల ప్రకటనకు నిరసన
వివిధ పార్టీలు, సంఘాల నాయకుల మద్దతు
స్తంభించిన ట్రాఫిక్, కదిలివచ్చిన అధికారులు, పోలీసులు

సీడ్ పత్తి రైతుల ఆగ్రహం

సీడ్ పత్తి రైతుల ఆగ్రహం

సీడ్ పత్తి రైతుల ఆగ్రహం

సీడ్ పత్తి రైతుల ఆగ్రహం