
చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలి
అడ్డాకుల: చట్టాలు, హక్కులపై బాలలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర పేర్కొన్నారు. మూసాపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, సంకలమద్ది శివారులోని కేజీబీవీలో మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో విద్యార్థులను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. బాల్యవివాహాల మూలంగా అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పారు. సరైన అవగాహన లేని వయసులో జరిగే వివాహాలు ఎవరికీ మంచివి కావన్నారు. బాల్య వివాహాలను అరికటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యా హక్కు చట్టం, పోక్సో చట్టం, మోటార్ వెహికిల్, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ధేశించుకుని చదువుల్లో రాణించాలని సూచించారు. చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పావనిసింగ్ రాజ్‌పుత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి ఇందిర