
చిరుత భయం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రం వీరన్నపేట శివారులోని అడవిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండు వారాలుగా తరుచుగా కనిపిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే పోలీసు, అటవీ శాఖలకు చెందిన మూడు బృందాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రెండు బోన్‌లు ఏర్పాటు చేసి సీసీ, డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ చిరుత కోసం గాలిస్తున్నారు. అయినప్పటికీ చిరుత ఆచూకీ లభించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రజావాణిలో సైతం వీరన్నపేట, సున్నంబట్టి ఏరియాలకు చెందిన ప్రజలు కలెక్టర్‌ను కలిసి చిరుతను బందించి తీసుకెళ్లాలని కోరారు. ఈ నేపపథ్యంలో కలెక్టర్ విజయేందిర, ఎస్పీ డి.జానకి, డీఎఫ్‌ఓ సత్యనారాయణ స్వయంగా వీరన్నపేట, గుర్రంగట్టు ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి గుట్టపైకి చేతికర్ర సహాయంతో కాలినడకన వెళ్లి కలియదిరిగారు. చిరుతను పట్టుకోవడం సాధ్యాసాద్యాలను ఫారెస్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, పోలీస్, మున్సిపల్ శాఖల నుంచి బృందాలు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటుతోపాటు సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వేలైన్స్‌తో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. చిరుత పాదాల అచ్చులను బట్టి ఆడ చిరుతగా ఫారెస్టు అధికారులు గుర్తించారని, ఇక్కడ గుట్టలో చిన్నచిన్న గుహలు ఉండటం వల్ల అందులో దాగి ఉండొచ్చనే అంచనాతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాన్నారు. ఎలాంటి సమాచారం తెలిసినా అటవీ శాఖ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే శివారు ప్రాంత ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, త్వరలోనే చిరుతను బందిస్తామని పేర్కొన్నారు.
● ఎస్పీ జానకి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం తరపున కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చిరుత సంచార ప్రాంతాల్లో పహారా బలగాలు, డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాల ద్వారా గమనిస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకేంద్రం వీరన్నపేట శివారులో పదిరోజులుగా కలకలం
స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీ
చేతికర్ర సహాయంతో అడవిలో కలియదిరిగి పరిశీలన
శివారు ప్రాంత ప్రజలు
జాగ్రత్తగా ఉండాలని సూచన

చిరుత భయం