
కార్పొరేషన్ ఆదాయానికి గండి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో చికెన్, మటన్ (మాంసం) వ్యాపారం నిత్యం రూ.లక్షల్లో జరుగుతోంది. ఇందులో భాగంగా ఏటా మున్సిపల్ కార్పొరేషన్ చికెన్ వేస్టేజీకి సంబంధించి టెండరు పిలుస్తున్నా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. టెండరు ఒకరు దక్కించుకుంటే.. మరొకరు దీనిని ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుండటం గమనార్హం. అయితే వేలం పాటలో పాడిన మొత్తంలో ఎవరూ నయా పైసా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించకుండా యథేచ్ఛగా గండి కొడుతున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయా షాపులను ‘సాక్షి’ బృందం పరిశీలించగా ఎన్నో విషయాలు వెలుగు చూశాయి.
పెద్ద షాపులు 60.. చిన్నవి సుమారు 500
జిల్లా కేంద్రంలో చికెన్ అమ్మే దుకాణాలలో ముఖ్య కూడళ్లలో పెద్దవి 60 వరకు.. వీధులలో చిన్నవి సుమారు 500 ఉన్నాయి. వీటిలో పెద్ద షాపులతో పాటు వంద చిన్న షాపుల నుంచి ప్రతిరోజూ ఓ వ్యక్తి తమకు చెందిన ఓ వాహనంలో రెండు నుంచి మూడు టన్నుల వరకు వేస్టేజీని ఇతర ప్రాంతాలకు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారు. తనకు టెండరు దక్కకపోయినా ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ఒక్కో దుకాణాదారుకు ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నాడంటే ఈ వ్యాపారంలో ఎంత ఆదాయం వస్తుందో ఇట్టే అర్థమవుతోంది. మరోవైపు నిత్యం ఒక్కో దుకాణదారు కనీసం వంద కిలోల చికెన్ వినియోగదారులకు అమ్ముతున్నట్లు తేలింది. వీటి నుంచి వచ్చే వేస్టే జీ 50 కిలోలకు పైగా ఉంటోంది. అన్ని దుకాణా లకు సదరు వ్యక్తే పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు సరఫరా చేశారు. వాటిలో నిల్వ చేయగా మొత్తం రెండు నుంచి మూడు టన్నుల వరకు ఈ వేస్టేజీని తరలిస్తున్నారు. దీనిని ముఖ్యంగా చేపల చెరువులు ఉండే సుదూర ప్రాంతాల్లో క్యాట్‌ఫిష్ పెంపకానికి ఆహారంగా వాడుతున్నట్లు తెలుస్తోంది.
ఇళ్ల వద్దే జీవాలను కోస్తున్న తీరు..
ఇక జిల్లా కేంద్రంలో స్లాటర్ హౌస్ (వధశాల) లేక మాంసం విక్రయదారులు తమ ఇళ్ల వద్దే జీవాల(మేకలు, గొర్రెలు)ను కోస్తున్నారు. ప్రస్తుతం జీజీహెచ్ పక్కన సుమారు 30 దుకాణాలను పెట్టుకుని విక్రయిస్తున్నారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఎనిమిది దుకాణాలలోనూ అమ్ముతున్నారు. అలాగే పాత రైతుబజార్‌తో పాటు పట్టణంలో ప్రధాన కాలనీల్లో వద్ద మరికొందరు విక్రయిస్తున్నారు. అన్నిచోట్ల కలిపి ప్రతి రోజూ దాదాపు 10–12 క్వింటాళ్ల వరకు మటన్ అమ్ముతున్నారు. ఎక్కడికక్కడ పరిసరాలన్నీ అపరిశుభ్రంగా తయారయ్యాయి. పక్కనే ఈగలు, దోమలు ముసురుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
చికెన్ వేస్టేజీ తరలింపులో లొసుగులెన్నో?
టెండరు దక్కించుకున్నది ఒకరు.. రవాణా చేస్తున్నది మరొకరు
మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎవరూ చెల్లించని రుసుము
రూ.లక్షల్లో వ్యాపారం.. వధశాల లేని వైనం
ఎక్కడబడితే అక్కడ అమ్మకాలు.. పట్టించుకోని అధికారులు

కార్పొరేషన్ ఆదాయానికి గండి

కార్పొరేషన్ ఆదాయానికి గండి

కార్పొరేషన్ ఆదాయానికి గండి