
గడువులోగా సీఎంఆర్ పూర్తి చేయాలి
● అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: యాసంగి 2024–25 సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం గడువులోగా అందజేయాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యం రవాణా చేయాలన్నారు. దీనిని మిల్లర్లందరూ ప్రాధాన్యతగా పరిగణించి నిబంధనల మేరకు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 19 శాతం మాత్రమే బియ్యం తిరిగివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సీఎంఆర్ పురోగతిని తప్పక పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, డీఎం రవినాయక్ పాల్గొన్నారు.
12న ఫుడ్ ఫెస్టివల్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: వంద రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈనెల 12న పెద్ద ఎత్తున ‘ఫుడ్ ఫెస్టివల్’ నిర్వహించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం స్థానిక మెప్మా భవనంలో ఆర్‌పీలు, ఎస్‌హెచ్‌సీ–ఓబీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం స్థానిక శిల్పారామంలోని 42 స్టాళ్లలో వివిధ ఆహార పదార్థాల తినుభండారాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం నగర పరిధిలోని ఎస్‌హెచ్‌జీలతో మాట్లాడి వీలైనంత ఎక్కువ మంది ఈ ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలన్నారు. రెండో శనివారం కావడంతో నగర ప్రజలు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ తదితరులు రావచ్చన్నారు. కార్యక్రమంలో మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు పాల్గొన్నారు.
హజ్‌యాత్రకుదరఖాస్తుల స్వీకరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: రానున్న పవిత్ర హజ్‌యాత్రకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా హజ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి.మహమూద్‌అలీ, మేరాజుద్దీన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని వక్ఫ్ కాంప్లెక్స్‌లోని జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్‌యాత్ర దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. ఈనెల 31 తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా హజ్ సొసైటీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హజ్‌యాత్రకు సంబంధించి దరఖాస్తులను అందజేయాలని కోరారు. సొసైటీ తరపున దరఖాస్తుదారుల ఆన్‌లైన్ సేవలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు రవూఫ్‌పాష, సత్తార్, మహ్మద్ రఫీక్, ఖాజా నిజాముద్దీన్, మహ్మద్ ఫైజొద్దీన్, సయ్యద్ నిజాముద్దీన్, అహ్మద్ పటేల్, ఎండి.మూసా, రఫీక్ ఉర్ రహెమాన్, ఎండీ అర్షద్‌అలీ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి టోర్నీలో చాంపియన్‌గా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి చాంపియన్‌గా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్‌లో బుధవారం నుంచి నెల 12తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలికల జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు మంగళవారం తరలివెళ్లింది. ఈసందర్భంగా జిల్లా జట్టును స్థానిక మెయిన్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఫుట్‌బాల్‌లో జిల్లాలో క్రీడాకారులకు కొదువలేదన్నారు. జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నతస్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శంకర్ లింగం, ప్రధాన కార్యదర్శి భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, సభ్యులు నందకిషోర్, కోచ్ వెంకట్రాములు, ప్రకాశ్, లక్ష్మణ్, భార్గవి, పూజ పాల్గొన్నారు.
జిల్లా ఫుట్‌బాల్ జట్టు: ముడావత్ నిఖిత, ఎంవీ దయాంజలి, పి.ఆనంద వర్షిణి, వినుతశ్రీ, తిరుమల రుత్విక, డి.సునీత, పాత్లవత్ ఆర్తి, ఎ.వర్ష, ఎల్.అనూష, సి.మణిదీపిక, కె.నిహారి క, ఆర్.సావిత్రి, ఎం.కీర్తి, ఆర్.పూజ, స్వాతి, కె.నిత్య, శాన్విత, నర్వ రిశితారాజ్.