
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి
జడ్చర్ల: మహిళా సంఘాలు స్వయం సమృద్ధిని సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మంగళవారం జడ్చర్ల ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆమె పాల్గొని, మాట్లాడారు. గ్రామ, మండల స్థాయిలో మహిళా సంఘాల అధ్యక్షులు క్రమశిక్షణతో సంఘాలను బలోపేతం చేస్తూనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా పని చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూనే మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి నెలా సక్రమంగా మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని, ప్రభుత్వం ఆ దిశగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏ పని చేసినా మహిళలు విజయవంతం చేస్తారనే భావన ఉందని, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లను ఎంపిక చేసుకుని లబ్ధి పొందాలన్నారు. ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాల ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చారని గుర్తు చేశారు. జడ్చర్ల మహిళా సమాఖ్య ద్వారా కూడా ఒక ఆర్టీసీ బస్సును కొనుగోలు చేసేందుకు రూ.6 లక్షలు వెచ్చించారని పేర్కొన్నారు. సోలార్ యూనిట్లు, క్యాంటీన్‌లు, చిరు దాన్యాల ఉత్పత్తుల తయారీ తదితర యూనిట్లపై దృష్టి సారించి ఆదాయాన్ని సాధించే దిశగా ఆలోచించాలన్నారు. మహిళలు ముందుకు వచ్చి స్వయం ఉపాధి, తదితర యూనిట్లపై దృష్టి సారిస్తే వాటి ఏర్పాటుకు పోలేపల్లి సెజ్‌లో స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు. అంతకు ముందు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన బీఎల్‌ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని వారికి అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల ఆవరణలో బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. కార్యక్రమంలో డీటీలు కిషోర్, మహబూబ్ అలీ, ఏపీఓ మాల్యనాయక్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఎంఈఓ మంజులాదేవి, తదితరులు పాల్గొన్నారు.