
నగరం.. కంపు కంపు
ఇది ఏనుగొండలోని శ్రీరామకృష్ణా కాలనీ వీధి నం.3 వద్ద పరిస్థితి ఇదీ. ఇటీవల ఈ కాలనీలో సీసీ రోడ్డు వేసినా పక్కనే ఇళ్లు లేవనే నెపంతో సగం వరకే డ్రెయినేజీ నిర్మించారు. వర్షాకాలం కావడంతో ఓపెన్ ప్లాట్లలో మురుగుతో పాటు వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విపరీతంగా దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలకు ఆవాసంగా మారడంతో చుట్టుపక్కల ఇబ్బందులకు గురవుతున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కొన్నేళ్లుగా మహబూబ్‌నగర్ నగరం వేగంగా విస్తరిస్తోంది. ఆ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కొత్త కాలనీలు, విలీన గ్రామాల్లో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ ఏడాది కాలంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లతో పాటు యూజీడీ నిర్మించారు. మరికొన్ని చోట్ల రోడ్డు మాత్రమే నిర్మించి డ్రెయినేజీ మాత్రం మరిచారు. అసలే వర్షాకాలం.. ఆపై లోతట్టు ప్రాంతాల్లో వరదతో పాటు మురుగు మొత్తం పేరుకుపోతోంది. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక కొన్ని వీధుల్లో పాత డ్రెయినేజీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొత్తవి నిర్మించకపోవడంతో మురుగుఏరులై పారుతూ రోడ్లపైకి వస్తుండటంతో కంపుకొడుతున్నాయి. మహబూబ్‌నగర్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ అయి ఐదు నెలలైనా సౌకర్యాల కల్పనలో ఎలాంటి మార్పు రాలేదని నగర ప్రజలు వాపోతున్నారు.
పాలమూరులో డ్రెయినేజీలు అస్తవ్యస్తం
విలీన గ్రామలు, కొత్త కాలనీల్లో తీవ్ర ఇబ్బందులు
ఓపెన్ ప్లాట్లలో ఎక్కడికక్కడ నిలుస్తున్న మురుగు
వర్షం వస్తే.. రోడ్లపైకి చేరుతున్న వైనం
కార్పొరేషన్‌గా మారినా ప్రయోజనం దక్కలే

నగరం.. కంపు కంపు