స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ నుంచి పిల్లలమర్రి రోడ్డు రైల్వే గేటు నంబర్ 58 వద్ద 111/8–9 నూతన ట్రాక్ పునరుద్ధరణ కోసం సోమవారం నుంచి బుధవారం (జూలై 2) వరకు రైల్వే గేటును మూసివేస్తున్నట్లు రైల్వే మహబూబ్‌నగర్ (పీడబ్ల్యూఏవై) సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రాంప్రసాద్‌గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వాహనాలను ఎల్‌సీ నంబర్ 59.. అనగా బోయపల్లి గేటు, బీఆర్ 243 వద్ద ఉన్న మోతీనగర్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు జరిగిన ఈ అసౌకర్యాన్ని చింతిస్తున్నామని, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.
175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ అనుమతి
పాలమూరు: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్‌ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్‌ఎంసీ బృందం పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేయడంతో దీనికి సదరు అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్‌ఎంసీ సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయో నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది.
మొక్కజొన్న @ రూ.2,348
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మొక్కజొన్న క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,348, కనిష్టంగా రూ.1,900 ధరలు లభించాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,684, కానుగు పలుకులు రూ.4,663 ధరలు పలికాయి.
ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.వెంకటేశ్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మిక సంఘం టీయూసీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెవెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కార్యదర్శి సాంబశివుడు, కురుమన్న, వెంకటేశ్, బాలమ్మ పాల్గొన్నారు.

ట్రాక్ మరమ్మతుల కోసం రైల్వేగేటు మూసివేత