
జూరాలకు భారీ వరద
ధరూరు/ దోమలపెంట/ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. శనివారం ప్రాజెక్టుకు 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం సాయంత్రానికి 1.50 లక్షలకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్టు గేట్లను ఎత్తి 1,16,424 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కులు, భీమా లిఫ్టు– 1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 150 క్యూసెక్కులు, కుడి కాల్వకు 290 క్యూసెక్కులు, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.729 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
జూరాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జూరాలలో ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,16,064 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ 25,707 మొత్తం 1,41,771 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయం వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఎంజీకేఎల్‌ఐకు నీటి విడుదల జరగలేదు. కాగా.. ఆదివారం శ్రీశైలం జలాశయంలో 871.2 అడుగుల వద్ద 146.9200 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ప్రాజెక్టు 12 క్రస్టు గేట్ల ఎత్తివేత
వేగంగా విద్యుదుత్పత్తి
జూరాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ కేంద్రాల్లో ఇప్పటి వరకు 153.734 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.