
నేడు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో వచ్చేనెల 6వ తేదీన 23న జరిగే రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే (అండర్–10, 12, 14 ఏళ్లలోపు బాలబాలికలు) జిల్లా క్రీడాకారుల ఎంపికలను ఆదివారం జిల్లా కేంద్రం మెయిన్‌స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. ఉద యం 9 గంటలకు అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తామని, క్రీడాకారులు ఎస్‌ఎస్‌సీ మెమో, తహశీల్దార్ ద్వారా కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రాలతో రిపోర్ట్ చేయాలని కోరారు.
మొక్కజొన్న @ రూ.2,331
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,331, కనిష్టంగా రూ.1,731 ధరలు లభించాయి. వేరుశనగకు రూ.3,001, ధాన్యం హంస రూ.1,731, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,089, కనిష్టంగా రూ.1,869 ధరలు పలికాయి.
మెప్మా కార్యక్రమాలకు సహకారం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో శనివారం ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీనిని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో మహిళా సంఘాల పాత్ర కీలకమన్నారు. ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను విజయవంతం చేయాలన్నారు. మెప్మా ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు కార్పొరేషన్ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, దేవమ్మ, యాదయ్య, నిర్మల తదితరులు పాల్గొన్నారు. కాగా, మహిళా సంఘాల సభ్యులు సుమారు 20 మంది తాము తయారీ చేసిన వివిధ రకాల పచ్చళ్లు, తినుబండారాలు ప్రదర్శనగా ఉంచారు.
స్వరాష్ట్రంలోనూ ప్రజల కష్టాలు తీరలేదు
పాలమూరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా వనరులను వినియోగించి ప్రజల కష్టాలు తీరుస్తారని భావించినా ఇప్పటికీ పూర్తి కాలేదని పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవా చారి అన్నారు. ఉమ్మడి పాలమూరు సాగునీటి సమస్యపై జూలై 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సదస్సుకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లాకేంద్రంలోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదుల నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నిర్మించి నీటితో నింపి సాగుకు యోగ్యమైన 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారని అనుకున్నా.. పూర్తిగా జరగలేదన్నారు. ఆర్డీఎస్, నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్‌లు అరకొర నీటిని అందిస్తున్నాయని తెలిపారు. జూరాల ఇన్నేళ్లయినా పూర్తిస్థాయిలో నీటిని అందించడం లేదని, దశాబ్దాలుగా పోరాడి సాధించిన పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి తరలించి డిండి, నల్లగొండ ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. ఇంకా పాలమూరు అభివృద్ధికి నోచుకోక కృత్రిమ కరువుతో పాటు నిత్యం వలసలు కొనసాగుతున్నాయని తెలిపారు. జూలై 5న నిర్వహించే రాష్ట్ర సదస్సుకు ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, నాయకులు అధిక సంఖ్యలో రావాలని కోరారు. కార్యక్రమంలో జక్కా గోపాల్, వెంకటేశ్వర్లు, తిమ్మప్ప, కేసీ వెంకటేశ్వర్లు, వెంకట్‌రాములు, వామన్ కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.