
జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/దోమలపెంట/ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత నాలుగు రోజులుగా ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం ప్రాజెక్టుకు 72వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఆదివారం రాత్రి 53వేల క్యూసెక్కులకు తగ్గిందన్నారు. దీంతో తెరిచిన 10 క్రస్టు గేట్లలో ఏడింటిని మూసివేసి మూడింటి ద్వారా 12,303 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. విద్యుదుత్పత్తికి 38,164 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 650, ఆవిరి రూపంలో 69 , ఎడమ కాల్వకు 920 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750, ప్రాజెక్టు నుంచి మొత్తం 53,771 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.869 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.
శ్రీశైలలానికి 49,363 క్యూసెక్కులు
జూరాలలో ఆదివారం విద్యుదుత్పత్తి చేస్తూ 37,160 క్యూసెక్కులు, ఆనకట్ట గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 12,203 మొత్తం 49,363 క్యూసెక్కుల నీటిని దిగువున శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 855.2 అడుగుల వద్ద 92.4860 టిఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో ఎంజీకేఎల్‌ఐకు నీటి విడుదల జరగలేదు.
11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి
జూరాల దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వార విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 46.172 మి.యూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 52.209 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు. ఇప్పటివరకు 98.381 మి.యూ విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు.
పదింటిలో.. ఏడు క్రస్టు గేట్ల మూసివేత
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి