
చిన్నారికి శాశ్వత ఉచిత బస్‌పాస్ అందజేత
కొల్లాపూర్: ఆర్టీసీ బస్సులో జన్మించిన అమ్మాయికి శాశ్వత బస్‌పాసును అధికారులు అందించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన గర్భిణి సువర్ణమ్మ ఏప్రిల్ 15న నాగర్‌కర్నూల్‌కు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లింది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. పెద్దకొత్తపల్లి సమీపంలో నొప్పులు ఎక్కువ కావడంతో ఆశావర్కర్ మల్లికాంత బస్సులోనే సువర్ణమ్మకు ప్రసవం చేయగా. అమ్మాయి జన్మించింది. బస్సులో పుట్టిన ఆ బిడ్డకు శాశ్వత బస్‌పాసు ఇస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఆయన ఆదేశానుసారం సువర్ణమ్మకు ఆమె కూతురి పేరిట కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్ శాశ్వత ఉచిత బస్‌పాసును గురువారం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆమె జీవితాంతం ఎక్కడైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చని వివరించారు. అదేవిధంగా ఆశావర్కర్ మల్లికాంతకు ఏడాది కాలానికి ఉచిత బస్‌పాస్ అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు రత్నమ్మ, నజీర్ తదితరులున్నారు.