అల్లం సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

అల్లం సాగు.. లాభాలు బాగు

Jun 19 2025 4:24 AM | Updated on Jun 19 2025 4:24 AM

అల్లం

అల్లం సాగు.. లాభాలు బాగు

అలంపూర్‌: సాంప్రదాయ పంటల సాగులో వస్తున్న నష్టాల నుంచి గట్టెక్కడానికి అన్నదాతలు వాణిజ్య పంటల సాగుపై దృష్టి కేంద్రికరీస్తున్నారు. జిల్లా పరిధిలో పలు రకాల వాణిజ్య పంటలు సాగు చేస్తూ లాభాల బాట పడుతున్నారు. వరి పంట కంటే తక్కువ నీటితో అల్లం సాగుచేసే అవకాశం ఉండటంతో రైతులు అల్లం సాగుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్‌ అల్లం పంట సాగుపై పలు సూచనలు ఇచ్చారు.

అనువైన నేలలు :

అల్లం సాగుకు ఎర్రనేలలు అనువుగా ఉంటాయి. నీరు నిల్వ ఉండని నేలల్లో పంట సాగు అనుకూలం. వరిసాగుతో పోల్చుతే నీటి వినియోగం చాల తక్కువగా ఉంటుంది. ఎకరా పొలంలో వరి సాగు చేయడానికి కావాల్సిన నీటితో ఒక్కటిన్నర ఎకరంలో అల్లం సాగు చేసుకోనే వెసులుబాటు ఉంటుంది.

రకాలు– లభ్యత :

మారన్‌ విత్తనాలు మంచి దిగుబడిని ఇస్తాయి. దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మహావ రకం మహారాష్ట్రలో లభిస్తోంది. ఇవేకాక కేరళలో ఎర్నాడ్‌, వేనాడ్‌, కరుప్పం పాడి, నడియా అల్లం రకాలు ప్రసిద్ధిగాంచినవి.

పంట సాగు కాలం :

ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో పంట చేతికి అందుతుంది.

విత్తన మోతాదు :

ఎకరానికి 1,000 కేజీల విత్తనాలు కావాల్సి ఉంటుంది. 20 రోజులపాటు కుప్పగా వేసి మండె కట్టాలి. మండె కట్టిన 20 రోజుల అనంతరం విత్తిన దుంపలు చిన్నచిన్న మొలకలు రాగానే వాటిని 30 గ్రామాల బరువు ఉండేలా కత్తిరించాలి. వీటిని లీటర్‌ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్‌, 2 మి.లీ క్లోరోఫైరిపాస్‌ కలిపి 30 నిమిషాలు నానబెట్టి భూమిలో విత్తాలి. విత్తిన 3– 5 వారాల్లో పూర్తిగా మొలక వస్తోంది. ప్రతిరోజు 6 గంటల పాటు డ్రిప్‌తో నీటిని అందించాలి.

విత్తే సమయం :

సాధారణ సమయాల్లో జూన్‌ నెలలో అల్లం పంట సాగు చేసుకోవచ్చు. నీటి పారుదల ఉంటే ఫిబ్రవరిలో లేదా మార్చి నెలల్లో సాగు చేపట్టొచ్చు.

ఎరువులు :

పిలక దశలో మొదటి నాలుగు నెలలు యూరియా 20: 20 ఎరువులు రోజు మార్చి రోజు డ్రిప్‌ ద్వారా అందించాలి. దుంప ఎదుగుదల దశలో 13: 0: 45 ఎరువులు 3 నుంచి 5 నెలల వరకు ప్రతినెల ఒకసారి ఇవ్వాలి. వీటితోపాటు మెగ్నీషియం సల్ఫేట్‌, కాల్షియం నైట్రేట్‌ అందించాలి.

తెగుళ్ల యాజమాన్యం :

అల్లం సాగులో ప్రధానంగా దుంపకుళ్లు తెగులు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించొచ్చు. వీటి వలన 30– 50 శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దుంప కుళ్లును గుర్తించినట్లయితే మెటలాక్సిల్‌ 1 గ్రాము లీటర్‌ నీటిలో కలిపి వేరు ప్రాంతం తడిచేలా పోయాలి. ఈ విధంగా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు చేయాల్సి ఉంటుంది.

వేడిగాలుల నుంచి రక్షణ :

అల్లం మొలకెత్తిన తర్వాత బోదెలకు రెండు వైపులకు కింది భాగంలో 30 సెంటీమీటర్ల దూరంలో మొక్కజొన్న నాటుకోవాలి. దీని వలన పిలక దశలో అల్లం పంటను వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకోవచ్చు.

దిగుబడి :

ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ధర రూ.30 వేల వరకు పలుకుతుంది. దీంతో సుమారు ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

పాడి–పంట

దుక్కి ఇలా...

అల్లం సాగులో దుక్కి చాల ముఖ్యమైంది. దుక్కిని 30 సె.మీ లోతు వరకు దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 ట్రక్కుల బాగా చిలికిన పశువుల ఎరువు, 150 కేజీల సూపర్‌, 30 కేజీల పొటాష్‌ వేసుకోవాలి. కనీసం 30 సె.మీ ఎత్తు, బోదె పైభాగం, 90 సె.మీ ఉండేలా 4 అడుగుల వెడల్పుతో బోదెలు తయారు చేసుకోవాలి. నీటి తడుల కోసం బోదెల మధ్య ఇన్‌లైన్‌ డ్రిప్‌ అమర్చుకోవాలి.

అల్లం సాగు.. లాభాలు బాగు 1
1/2

అల్లం సాగు.. లాభాలు బాగు

అల్లం సాగు.. లాభాలు బాగు 2
2/2

అల్లం సాగు.. లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement