
కాంగ్రెస్ కులగణన ఎన్నికల డ్రామా: ఎంపీ
పాలమూరు: బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, కేంద్రం నిర్వహించబోయే జనగణన విషయంలో ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఎంపీ మాట్లాడారు. జనగణనతో పాటు కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రత్మాకమైందన్నారు. కాంగ్రెస్ చెబితేనే ఏదో కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తోందని అని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన ఓ తప్పుల తడక అని, సగం మంది ప్రజలు ఈ కులగణనలో పాల్గొన లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. ఓట్లు సీట్ల కోసమే కులగణన తప్ప వారికి చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని మండిపడ్డారు. 1931లో జరిగిన కులగణనలో మతపరమైన రిజర్వేషన్లు కోరడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని తెలిపారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం కులగణన డ్రామాకు తెర లేపారన్నారు. మైనార్టీలను బీసీలలో చేర్చడం అంటే బీసీలను మోసం చేయడమేనన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇన్నాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2029 ఎన్నికల వరకు కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. కాంగ్రెస్ చేసిన కుల గణనను బీసీ ప్రజలు వ్యతిరేకించారంటే అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంతో విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో డ్రామాలు చేస్తే ఊరుకోమని, ఎమ్మెల్యే కోట కింద 3,500 ఇళ్లు అంటే ఎంపీ కోట కింద ఎన్ని ఇళ్లు ఇస్తారో చెప్పాలన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని, అర్హులకు అన్యాయం చేస్తే వారితో కలిసి రోడ్డు ఎక్కాల్సి వస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, బాలరాజు, అంజయ్య పాల్గొన్నారు.