అంబేడ్కర్‌ అందరివాడు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అందరివాడు

Apr 15 2025 12:21 AM | Updated on Apr 15 2025 12:21 AM

అంబేడ్కర్‌ అందరివాడు

అంబేడ్కర్‌ అందరివాడు

మహబూబ్‌నగర్‌ రూరల్‌: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందరివాడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ కళాభవన్‌లో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల ప్రజలు సమాన స్థాయికి వచ్చేంతవరకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన వెసులుబాటు కల్పించారని చెప్పారు. అగ్రవర్ణాలు, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు అందరూ ఈ రోజు సుఖసంతోషాలతో భారతదేశంలో ఉండగలుగుతున్నారంటే దానికి కారణం అంబేడ్కర్‌ చూపిన విధానం అని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో కేటాయింపులు ఉండాలని, ఏ వర్గానికి కేటాయించిన బడ్జెట్‌ను ఆ వర్గానికే కేటాయించి వారి అభివృద్ధికి కార్యాచరణ ఉండాలని 100 శాతం ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే కేవలం ఒక్క హన్వాడ మండలంలోనే రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద ప్రతి తండాకు కూడా రోడ్డు వేస్తున్నామని అన్నారు. వచ్చే సంవత్సరంలోగా కచ్చితంగా మిగిలిన రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం తనకు కావాలన్నారు. మీ పిల్లలను మంచిగా చదివించాలని, చదువుకుంటే భవిష్యత్‌ బంగారు మాయమవుతుందన్నారు. జనవరి నెలలో విద్యానిధి ఏర్పాటు చేశానని, వివిధ రంగాల వ్యక్తుల నుంచి దీనికి ఇప్పటికి రూ.50 లక్షల విరాళాలు వచ్చాయన్నారు. మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్‌ కళాభవన్‌లో నిరుద్యోగులకు ఈ నెల 16 నుంచి ఉచితంగా కోచింగ్‌ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ డీడీ సుదర్శన్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, వకీల్‌ భీమయ్య, మల్లెపోగు శ్రీనివాస్‌, వెంకటేష్‌, సామెల్‌, యాదయ్య, రవికుమార్‌, చెన్నకేశవులు, శ్రీరాములు, బండారి రాములు, బాలపీరు, రఘునాథ్‌ పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద అభివృద్ధి పనులు

మహబూబ్‌నగర్‌ విద్యా నిధికి విశేషంగా ఆదరణ: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement