
కల్యాణ ఉత్సవంలో మంగళసూత్రాన్ని చూయిస్తున్న అర్చకులు
చిన్నచింతకుంట: తెలంగాణ ప్రజలు తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచే శ్రీ అమ్మాపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయాన్ని శుద్ధిచేసి సుప్రభాత సేవ మొదులుకొని వేదపండితులు పూజలు ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, బేరిపూజ, అష్టోతర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కురుమూర్తి స్వామి, పద్మావతి, అలివేలు మంగమ్మ అమ్మవార్ల కల్యాణం కనులపండువగా కొనసాగింది. ఈ వేడుకను పురస్కరించుకొని శ్రీనివాసుడి దంపతులకు నూతన పట్టువస్త్రాలతో పాటు బంతిపూలు, మల్లెపూలు ధరింపజేశారు. కల్యాణాన్ని తిలకించేందుకు ఆయా గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కురుమూర్తి కొండలు గోవింద నామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ప్రధాన అర్చకులు వెంకటేశ్వర చార్యులు, అర్చకులు వెంకటయ్య, నర్సింహులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వైభవంగా కల్యాణం

ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు