● కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు లభిస్తుందని కాకతీయ యూనివర్సిటీ కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో నాణ్యత హామీ, న్యాక్ గుర్తింపు’ అనే అంశంపై గూగుల్‌మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హైదరాబాద్ నుంచి హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధి, నాణ్యతాప్రమాణాల సాధనలో న్యాక్ గుర్తింపు అనేది అత్యంత కీలకమన్నారు. నూతన న్యాక్ మూల్యాంకన విధానం, పారదర్శకత, జవాబుదారీతనం, ఫలితాధారిత విశ్లేషణకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. పరిపాలనా ప్రక్రియగా కాకుండా నిరంతర పురోగతికి దోహదపడే సాధనంగా భావించాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ గుర్తింపు సాధనలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానవక్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓఎస్‌డీ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ న్యాక్ గుర్తింపు ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. డేటా సేకరణ కేంద్రాల ఏర్పాటు, ప్రతి అధ్యాపకుడికి వ్యక్తిగత వెబ్‌పేజీల రూపకల్పన, పేటెంట్లు, పరిశోధనా ప్రచురణలు, స్వయం పోర్టల్ వినియోగం, పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలను తెలిపారు. కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య నర్సింహాచారి కార్యక్రమ లక్ష్యాలు, కాకతీయ యూనివర్సిటీ నాణ్యతాభివృద్ధిలో న్యాక్ గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. కేయూ ఓఎస్‌డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి మాట్లాడారు. యూనివర్సిటీలోని పలు విభాగాల అధిపతులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.


