ఆగిన అన్నదాత గుండె | - | Sakshi
Sakshi News home page

ఆగిన అన్నదాత గుండె

May 18 2026 6:57 AM | Updated on May 18 2026 6:57 AM

ధాన్యం కొనుగోలు కేంద్రంలో

అస్వస్థతకు గురై మృతి

అలంకానిపేటలో ఘటన

నెక్కొండ: రైతు కష్టానికి విలువ లేదు.. పండించిన పంటను తీసుకునే నాథుడు లేడు.. రోజులకొద్ది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. నిర్వాహకుల పట్టింపులేమితో రైతులు ఆందోళనలకు గురై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుండె ఆగిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామస్తులు, తోటి రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్‌ (65) యాసంగి పంటగా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. నెక్కొండ మక్కల కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలియడంతో సంగెం మండలం కాపులకనపర్తి కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం 100 క్వింటాళ్ల మక్కలు తీసుకెళ్లాడు. అలాగే, గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం 60 క్వింటాళ్ల ధాన్యం తీసుకెళ్లాడు. ఇలా రోజుల తరబడి రెండు చోట్ల రైతు పెద్ద వెంకటేశ్వర్‌ పంటలను అమ్మేందుకు పడరానిపాట్లు పడుతున్నాడు. ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చి ధాన్యం ఆరబెడుతుండగా గుండెలో నొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యాడు. తోటి రైతులు వెంటనే అప్రమత్తమై సీపీఆర్‌ చేశారు. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతువాత పడ్డాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమారులు వేణు, విజయ్‌, కుమార్తె కర్ణ ఉన్నారు. రైతు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement